నా పూర్తి పేరు వెంకట శివ రామ కృష్ణా రావు.. చాల చిన్న పేరు కదా.. :) మా అమ్మ అసలు నాకు ఈ పేరు పెట్టింది మా పెద్ద తాతయ్య పేరు మీద. మా పెద్ద తాత పేరు వెంకయ్య. కానీ వెంకట అనేది చాలామంది పేరు లో మొదటగా ఉంటుంది కాబట్టి అసలు నన్ను ఆ పేరు తో ఎవరు పిలిచేవారు కాదు. స్కూల్ వరకు అందరూ శివ రామ కృష్ణ అని పిలిచేవాళ్ళు. పాలిటెక్నిక్ లో ఏ వి యస్ అని పిలిచేవాళ్ళు (ఇంటి పేరు అట్టా కనుక మొదటి మూడు పదాల్లో అక్షరాలని కలిపి ఏ వి యస్ అనేవాళ్ళు). ఇంజనీరింగ్ లో కొంత మంది శివ అని, కొంత మంది రామ కృష్ణ అని, ఇంకొంత మంది శివ రామ కృష్ణ అని పిలిచేవాళ్ళు. నాకు శివ అని పిలిస్తే ఇష్టం.
కానీ విచిత్రంగా ఉద్యోగం లో చేరక వెంకట అని పిలవడం మొదలు పెట్టారు. మొదట్లో అస్సలు నచ్చేది కాదు.. మొదట్లో పనిచేసింది తెలుగు వాళ్లతో కాదు.. వాళ్లకి తెలియదు కాబట్టి మొదటి పేరు తో పిలిచేవాళ్ళు. అలా దాదాపు పేరు మొత్తం కవర్ అయ్యింది. ఇంకా రావు ఒక్కటే మిగిలింది :). ప్రస్తుతం చాలా మంది శివ అనే పిలుస్తున్నారు. ఇది నా అసలు పేరు కధ. నాకో ముద్దు పేరు కూడా ఉందండోయ్ అదే 'బుల్లి బాబు'. 'బుల్లి' బాబు పేరు మాత్రం పెద్దదే :).